అమెరికా : ఇచ్చట నమ్మకమైన, నాణ్యమైన, తాజా స్వైన్ ఫ్లూ ఎగుమతి చేయబడును-2
మధ్యకాలంలో స్వైన్ ఫ్లూతో చనిపోయిన మొట్టమొదటి మానవరోగి మెక్సికోకి చెందిన Edgar Hernandez అనే అయిదేళ్ళ పిల్లవాడు. "ప్రపంచంలో అంతకుముందు ఎవరికీ రాని జబ్బు ఆ పిల్లవాడికే ఎందుకు రావాలి ?" అనడిగితే చెప్పడానికి చాలా కథ ఉంది. ఆ పిల్లవాడు నివసిస్తున్న La Gloria ప్రాంతంలో ప్రజల్ని అంతకు ముందునుంచే ఫ్లూ జబ్బు తఱచుగా పీడిస్తూండేది. దానికి తోడు ఆ ఊరికి సమీపాన సంయుక్త రాష్ట్రాలకి చెందిన Smithfilelds Foods కంపెనీవారి భారీ పందుల పెంపక కేంద్రాలు నెలకొని ఉన్నాయి. అది స్వైన్ ఫ్లూ అవునా ? కాదా ? అనే విషయమై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. పందుల పట్ల అమెరికన్లకి ఉన్న "బిజినెస్ సెంటిమెంట్" దృష్ట్యా ఈ పరిశోధనలు నా జీవితకాలం లోపలే ఓ కొలిక్కి వస్తాయో రావో తెలియదు. వస్తే సంతోషం.ఈ సందర్భంగా - స్వైన్ ఫ్లూ వ్యాప్తికి అటువంటి పందుల పెంపక కేంద్రాల్ని బాధ్యుల్ని చేసేముందు - స్వైన్ ఫ్లూకి ఆ పేరు పెట్టడం సమంజసమేనా ? అది నిజంగా పందుల వల్లనే వస్తుందా ? కాదా ? అనే సందేహాలకి సమాధానాలు వెతకడం అవసరం. బర్డ్ ఫ్లూ, మానవ ఫ్లూ వైరస్సులు కలిసి పంది ఫ్లూ వైరస్సుతో ఏకమైతే విఱుచుకు పడగల ఉపద్రవాల గుఱించి శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో భయపడుతూ వస్తున్నారు. వారు ఈ సంభావ్యతకి Deadly viral cocktail అని పేరు పెట్టారు. ఈ భయానికి బర్డ్ ఫ్లూకి ఉన్నంత చరిత్ర ఉంది. కారణం - ఒక వైరస్సులో మానవ ఫ్లూ వైరస్ కణాల ఉనికి మనిషి నుంచి మనిషికి వాటిని నేరుగా వ్యాపింపజేయడానికి సహకరిస్తుంది. చిత్రమేంటంటే పందుల నుంచి వ్యాపించగల (స్వైన్) ఫ్లూకి విజ్ఞానంలో ప్రత్యేకంగా శాస్త్రీయ నామమేదీ లేకపోవడం. మానవ ఫ్లూని పిల్చినట్లే దాన్ని కూడా H1N1 అని ప్రచారం చేస్తున్నారు. అంటే స్వైన్ ఫ్లూ యొక్క హంతక స్వభావాన్ని తగ్గించి చూపిస్తున్నారు. నిజానికి మానవ ఫ్లూ "విజయాలు" కూడా తక్కువవేమీ కాదు. క్రీ.శ. ౧౯౧౮-౧౯ ప్రాంతంలో ఇన్ ఫ్లూయెంజాతో ప్రపంచంలో పదికోట్ల మంది ఒక్క ఏడాది వ్యవధానంలో ఖతమయ్యారు. అనంతర కాలంలో మందులు కనుగొన్నాక ఆ విధంగా ఫ్లూతో చనిపోయే మానవ కేసులు అరుదై పోయాయి. కానీ ఇటీవల బర్డ్ ఫ్లూ విజృంభణతో అంతా తారుమారైంది. "పందులు కూడా మానవుల్లాగే ఫ్లూకి బలయ్యే తత్త్వం గలవైనప్పుడు వాటిని ఇప్పుడు Smithfields కంపెనీవారు పెంచుతున్నంత భారీ స్థాయిలో పెంచడం మానవజాతికి క్షేమమేనా ?" అనే ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది.
ప్రాకృతికంగా పందులు బహు ముఱికి జీవాలు, వాటికి ఎంత శుభ్రమైన దాణా పెట్టి పెంచినా సరే ! ఉదాహరణకి - ఒక సగటు పంది సగటు మనిషి కంటే మూడు నుంచి నాలుగు ఱెట్ల పరిమాణంలో మలినాల్ని విసర్జిస్తుంది. దాని విసర్జితాలు అంతకంటే భయంకరమైనవి. వాటిల్లో భారీ మొత్తాల్లో భాస్వరం, నైట్రోజెన్, అమ్మోనియా ప్రోగుపడి ఉంటాయి. అందుచేత వాతావరణాన్ని కలుషితం చేసే విషయంలో ఒక పందుల పెంపక కేంద్రం ఒక పెద్ద పెట్రో రసాయనాల కర్మాగారానికి సాటొస్తుంది. అదీగాక మానవులతో పోలిస్తే పంది విసర్జితాలు వందఱెట్ల నుంచి పదివేల ఱెట్లు ఎక్కువ సూక్ష్మజీవుల్ని కలిగి ఉన్నట్లు పరిశోధనలు ధ్రువీకరిస్తున్నాయి, వాటికి ఎంత శుభ్రమైన తిండి పెట్టినా సరే ! ఆ సూక్ష్మజీవుల్లో ఫ్లూ వైరస్సులు ఖచ్చితంగా ఉండవని ఎవరూ స్టాంప్ పేపరు మీద సంతకం చేసి హామీ ఇవ్వజాలరు. పందుల నుంచి జనానికి జబ్బులంటుకోవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ముఖ్యంగా ట్రైకినోసిస్, యాక్టినోమయోసిస్, బ్రూసెల్లోసిస్ అని మూడు రకాల జబ్బులొస్తాయని ఇదివఱకే తెలుసు. అలా యముడి సైన్యం లాంటి పందుల్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాంసవ్యాపారం కోసం ఎంత బృహత్ స్థాయిలో పెంచుతున్నారో తెలిస్తే, స్వైన్ ఫ్లూకి ప్రత్యేకంగా శాస్త్రీయమైన పేరు ఎందుకు లేకుండా పోయిందో, దానికి మానవుల పేరే ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నదో లెస్సగా అవగాహనౌతుంది.
నిజానికి అమెరికన్లు తినే మాంసంలో నాలుగోవంతు భాగం పందులదే. తాను తినడమే కాకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక మిలియన్ టన్నుల పందిమాంసాన్ని అమెరికా ఇతర దేశాలకి ఎగుమతి చేస్తోందంటే, అమెరికా గడ్డపై ఇది ఎంత బృహత్ పరిశ్రమగా వేళ్ళూనుకుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ పందిమాంస వ్యాపార దిగ్గజం అని చెప్పుకోదగ్గ స్మిత్ ఫీల్డ్స్ కంపెనీ ఒక్కదానికే ఆ దేశపు పందిమాంసపు టమ్మకాల్లో సుమారొక పావు వాటా ఉందంటే, ఎంత పెద్దపెద్ద తిమింగలాలు ఈ వ్యాపారంలో ఉన్నాయో, అవి సంయుక్త రాష్ట్రాల రాజకీయాల్ని, తద్ద్వారా మిహతా ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయో తెలుస్తుంది. మెక్సికోలో లా-గ్లోరియా సమీపాన గల పెంపక కేంద్రం ఒక్కదాంట్లోనే ఏడాదికి సుమారు పదిలక్షల పందుల్ని పెంచి, చంపేసి, మాంసంగా పొట్లం (packaging) కట్టి అమ్ముతారు. ఆవిధంగా ఆ సంస్థ ఒక్క ౨౦౦౬ వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కర్మాగారాల్లో రెండున్నఱ కోట్ల పందుల్ని చంపి పొట్లం కట్టింది. ఈ బేహారంలో అది ఆ యేడాది మూటగట్టుకున్న ఆదాయం అక్షరాలా పదకొండు వందల కోట్ల డాలర్లు మాత్రమే. అందుచేత, "తగుదునమ్మా" అని ప్రతివిషయంలోను ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికన్లు, స్వైన్ ఫ్లూ విషయంలో మాత్రం తమ ప్రియతమ పందుల మీద చిన్నమాట కూడా పడనివ్వక పోవడానికి గల గంభీర లోపాయికారీ కారణాల్ని సైతం మనం ఇతోఽధికంగా ఆకళింపు చేసుకోవచ్చు.
నార్తు కరోలినా కోటి పందుల వీణ : పవిత్రమైన పందిమాంస వ్యాపారాన్ని భక్తితో భజించి తరిస్తున్న రాష్ట్రాలు అమెరికాలో లెక్కకి మిక్కిలి. ఆ జాబితాలో అయోవా (కోటీ నలభై లక్షల పందులు), ఇలినాయ్ (యాభయ్యేడు లక్షల పందులు), మిన్నెసోటా, ఇండియానా, నెబ్రాస్కా (ఒక్కొక్కటి నలభై లక్షల పందులు) ఉన్నాయి. ఇవి కాక మిస్సోరీ, ఉత్తర కరోలినా, ఓహయో, దక్షిణ డకోటా, కేన్సస్, మిషిగన్, విస్కాన్సిన్, జార్జియాలు కూడా దాదాపు పైన పేర్కొన్న సంఖ్యలకి తక్కువ కాని పందుల జనాభాతో తామరతంపరగా కళకళలాడుతున్నాయి.
వైరస్సుల కర్మాగారాలు : ఉత్తర కరోలినాకి పందుల పెంపక కేంద్రాలు మంచి ఆదాయ వనర్లు కావడంతో పాటు ఉపాధి కల్పనాధారాలు కూడా. అయినా అవి ఆ రాష్ట్రానికి ఒక పెద్ద, భరించరాని తలనొప్పిగా పరిణమించాయి. ఎందుకంటే పెంపక కేంద్రాల యజమానులకి (కంపెనీలకి) ప్రభుత్వమన్నా, దాని నియమనిబంధనలన్నా లెక్కా జమా లేకుండా పోయింది. వాళ్ళు అలా లాభాలతో బలిసిపోయారు. యథేచ్ఛగా పందుల విసర్జితాలతో ఉత్తర కరోలినా రాష్ట్రపు గాలినీ, నీటినీ, భూమినీ కలుషితం చేసేస్తున్నారు. ఆ రాష్ట్రంలో నలువైపులా ఉన్న ఆఱువేల భారీ పెంపక కేంద్రాల నుంచి వెదజల్లబడే నిరంతర దుర్భర దుర్గంధమూ, అసహ్యమైన ముఱికి ఉత్తర కరోలినాకి చెందిన అమెరికన్ల జీవన నాణ్యత (quality of life) ని స్లమ్ డాగ్స్ స్థాయికి దిగజార్చింది. ఒకానొక పెంపక కేంద్రంలో ఒకేసారి ఒకేచోట అఱవయ్యెనిమిది వేల పందుల్ని ఉంచే "సదుపాయం" ఉందంటే ఇహ అర్థం చేసుకోవచ్చు స్థానిక ప్రజల నరకయాతన. దీనికి పెంపక కేంద్రాల యజమానుల్ని సంజాయిషీ అడిగితే, "మేము ముఱికిని విడిగా వేస్ట్ లాగూన్స్ లో పోస్తున్నాం. రోజూ పందుల ఫారాల్ని అనేకసార్లు ఫ్లష్ చేస్తున్నాం. తఱచుగా పందుల శారీరిక నమూనాల్ని పరీక్షిస్తున్నాం. వ్యాధినిరోధక సూదిమందులిస్తున్నాం. మా ఉద్యోగులందఱూ నూఱుశాతం శుభ్రత పాటించాలని నిబంధన విధించాం" అంటూ అమాయకంగా మంచి ఒకటో తరగతి పాఠాన్ని చేతులు కట్టుకొని ఒప్పజెబుతారు. అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు చేపలు మాయమయ్యాయన్నట్లు రాష్ట్ర పర్యావరణం ఇలా దిగజాఱి పోవడానికి తాము కారణమని మాత్రం ఛస్తే ఒప్పుకోరు. అయితే ఎందుకో పాపం ! ఈ ’అమాయకుల’ మీద ౧౯౯౮ లో ౧,౨౯౬ అభియోగాలు నమోదయ్యాయి. వాటిల్లో ౯౦౦ అభియోగాలు అత్యంత తీవ్రమైనవి. ’అమాయకులు’ జరిమానాలు చెల్లించి బయటపడ్డారు. కానీ వారి ఉల్లంఘనలు (violations) అప్పట్నుంచి పెచ్చుమీఱాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవడం అసందర్భం కాదనుకుంటా. నిజానికి పదేళ్ళ క్రితమే (౧౯౯౮) ఉత్తర కరోలినాలో ఫ్లూ వ్యాధితో ముగ్గుఱు చనిపోయారు. అయితే అది స్వైన్ ఫ్లూ కావచ్చుననే అనుమానాలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి.
స్వైన్ ఫ్లూకి సంయుక్త రాష్ట్రాల నేపథ్యం ఇంతగా ఉంటే, అందులో తమ పాత్రేమీ లేనట్లు, అదేదో మెక్సికో అనే మూడో ప్రపంచ దేశపు తయారీ అయినట్లు సంయుక్త రాష్ట్రాల దొరతనంవారు అభినయించడం విచారకరం. "జనం చచ్చినా ఫర్వాలేదు, పందిమాంస వ్యాపారం మాత్రం మూడు పువ్వులూ, ఆఱు కాయలుగా వర్ధిలా"లనే ఈ ప్రతీప ధోరణికి అడ్డుకట్ట పడాలి. మళ్ళీ ఇందులో శాస్త్రపరిశోధకుల్ని తమ వ్యాపారాలకి అనుగుణంగా ప్రకటనలు చెయ్యమని ఒత్తిడి చెయ్యడం కూడా జఱుగుతోంది. ఈ శాస్త్రవేత్తలూ, వైద్యులూ ప్రాచీన కాలపు మతగురువుల్లా తయారయ్యారు. ఇలాంటి శాస్త్రవేత్తల వల్లా, అల్లోపతీ వైద్యుల వల్లా సైన్సుకి, వైద్యానికీ ఇప్పటికే చాలా చెడ్డ పేరొచ్చింది. కేన్సర్ కి పొగాకు కారణం కాదని ఆ మధ్య ఒక పరిశోధకుడు ప్రకటించాడు. అలాగే, భూతాపానికి (global warming) పారిశ్రామిక సంస్థలు అస్సలు కారణం కాదనీ, కేవలం ఆవులు వదిలే అపాన వాయువుల్లోని మీథేన్ గ్యాసే కారణమని నిరూపించడానికి గత అయిదాఱేళ్ళుగా కిందా మీదా పడుతున్నారు.
ఏదేమైనా, కంపెనీలు బావుండాలి, వారి పురోహితులైన సైంటిస్టులు బావుండాలి. వారి వాటాదారులైన ప్రభుత్వాలు బావుండాలి. జనం మాత్రం శంకరగిరి మాన్యాలు పట్టాలి.
(సమాప్తం)
More From This Author
About the Author
Celebrity Spotlight
Top Entertainment Articles
|
Zimbio Caption Contest: Enter and Win $25 at Amazon.com!
This is possibly the easiest photo to caption. It practically writes itself.
|
|
Twilight’s Christian Serratos Gets Naked For PETA
Serratos poses naked for the 'I'd Rather Go Naked Than Wear Fur' campaign.
|
|
100 Best Bikini Bodies
Click here for the best way to spend 10 minutes.
|
Popular Entertainment Zines






